జైలులో రాజభోగం

గ్లెన్‌ బ్రిగ్స్‌... ఈ కాలపు చార్లెస్‌ శోభరాజ్‌. రాష్ట్రంలో పేరు మోసిన నకిలీ సర్టిఫికెట్ల సృష్టికర్త. బ్రిగ్స్‌కు పోలీసులంటే లెక్కేలేదు. జైలంటే భయం లేదు. కేసులపై ఆందోళన లేదు. గుత్తి, గుంతకల్లు, తిరుపతి కేంద్రాలుగా వేల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి దేశవ్యాప్తంగా విక్రయించాడు. పోలీసులతో ఉన్న పరిచయాలతో జైలుకు వెళ్లినా రాజభోగాలు అనుభవించాడు. ఖాకీల నుంచి అందిన సహకారం.. జైలులో బ్రిగ్స్‌ దర్జా చూసి ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు.




అనంతపురం, గుంతకల్లు: నకిలీ సర్టిఫికెట్ల కేసుల్లో నిందితుడు గ్లెన్‌ బ్రిగ్స్‌ నేరచరిత్ర.. విలాసాలు.. జైలులో గడుపుతున్న రాజభోగాలు తెలిసి అధికారులే అవాక్కవుతున్నారు. ఇటీవల అరెస్టయి ప్రస్తుతం గుత్తి సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా బ్రిగ్స్‌ బయటి ప్రపంచంతో నిత్యం టచ్‌లో ఉంటున్నాడు. జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు గ్లెన్‌ బ్రిగ్స్‌ నేర చరిత్రను లోతుగా తవ్వడంతో నమ్మలేని ఎన్నో నిజాలు వెల్లడయ్యాయి. దీంతో ఎస్పీ సత్యయేసుబాబు ఆధారాలతో సహా జైలు శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దీంతో బుధవారం జైళ్ల శాఖ డీఐజీ వరప్రసాద్‌ గుత్తి సబ్‌జైలును తనిఖీ చేశారు. బ్రిగ్స్‌తో జైలు సిబ్బందికి ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ చేపట్టారు. గ్లెన్‌ బ్రిగ్స్‌తో జైలు సిబ్బంది ములాఖత్‌ అవుతున్న వైనం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు సబ్‌జైలు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు సిబ్బందిపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు.